Friday, September 27, 2024
HomeUncategorizedభారత్‌ నిరుద్యోగుల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ

భారత్‌ నిరుద్యోగుల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ

Date:

దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. భారత్‌లో ఉన్న నిరుద్యోగుల్లో 83 శాతం మంది యువతేనని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌వో) పేర్కొంది. 2022లో భారత్‌లోని మొత్తం నిరుద్యోగ జనాభాలో యువత 83 శాతం మంది ఉన్నారని తెలిపింది. ఐఎల్‌వో, ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్‌డీ) సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024’ను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ మంగళవారం విడుదల చేశారు.

నిరుద్యోగుల్లో విద్యావంతులైన యువకులు 2000లో 54.2 శాతం మంది ఉండగా, 2022లో ఇది 65.7 శాతానికి పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. అలాగే చదువుకున్న నిరుద్యోగుల్లో పురుషుల (62.2 శాతం) కంటే స్త్రీలు (76.7 శాతం) ఎక్కువగా ఉన్నారని తెలిపింది. భారత్‌లోని పట్టణ ప్రాంత యువ విద్యావంతులలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా కేంద్రీకృతమైందని ఈ రిపోర్ట్ పేర్కొంది. 2000 నుంచి 2019 వరకు యువకుల ఉపాధి, ఉపాధి పెరుగుదల తక్కువగా కనిపించిందని పరిశోధకులు గుర్తించారు. కరోనా మహమ్మారి దీనికి కారణమని అంచనా వేశారు.

మరోవైపు మరో దశాబ్దంలో భారత్‌లో యువ శ్రామిక శక్తి 7-8 మిలియన్లు (70-80 లక్షలు) చేరుకుంటుందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఐదు కీలక విధాన రంగాలపై దృష్టిసారించాలని పేర్కొంది. ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడం, ఉపాధి నాణ్యతను మెరుగుపరచడం, కార్మిక మార్కెట్‌లో అసమానతలను పరిష్కరించడం, క్రియాశీల కార్మిక మార్కెట్‌తోపాటు లేబర్ మార్కెట్ నైపుణ్యాలు, విధానాలు బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది.