బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లోకి చేర్చుకుంటున్న విషయం గురించి గవర్నర్‌కు తెలిపినట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని, ఈ విషయంపై స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు కూడా గవర్నర్‌కు వివరించినట్లు కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగుల సమస్యలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గవర్నర్ రాధాకృష్ణన్‌కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్రమంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. ఫిరాయింపుపై న్యాయ ప్రక్రియ నడుస్తోందని గవర్నర్‌కు తెలిపామని.. సమస్యలపై గవర్నర్ వెంటనే స్పందించారని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపై కక్ష కట్టిందని కేటీఆర్ విమర్శించారు. అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు, కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని వ్యాఖ్యానించారు. హామీలను ప్రభుత్వం అమలు చేయట్లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రంథాలయాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల హమీల్లో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ అన్నారని, జాబ్ క్యాలండర్‌పై వారు పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని కేటీఆర్ తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్స్ నోటిఫికేషన్స్‌ను రద్దు చేసి పోస్టులు పెంచి కొత్తవాటిని ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇప్పటివరకు జాబ్ క్యాలండర్ విడుదల చేయలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఇవన్ని గవర్నర్‌తో చర్చించినట్లు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే విధంగా ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతామన్నారు.