Friday, September 27, 2024
HomeUncategorizedబిజీ జీవితంలో తగ్గిపోతున్న లైంగిక ఆరోగ్యం

బిజీ జీవితంలో తగ్గిపోతున్న లైంగిక ఆరోగ్యం

Date:

మనిషి ఉదయం లేచినప్పటి నుండి, మళ్లీ పడుకునే వరకు బిజీ, బిజీ జీవితం గడుపుతున్నాడు. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో చాలా మంది జీవన శైలి గాడి తప్పింది. చాలా మందిలో లైంగిక వాంఛ, సామర్థ్యం తగ్గిపోతోంది. దీనివల్ల శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఆరోగ్యం బాగుంటేనే సెక్సువల్ లైఫ్‌ను ఆస్వాదించగలం. నిజానికి మానవులకు లైంగిక ఆరోగ్యం అనేది చాలా కీలకమైన అంశం. ఈ ఆరోగ్యం సరిగా లేకపోతే, పార్ట్‌నర్‌తో రిలేషన్‌షిప్ దెబ్బ తింటుంది. పార్ట్‌నర్‌తో గొడవలు కూడా మొదలవుతాయి. ఆత్మగౌరవం తగ్గుతుంది. లైంగిక సంతృప్తిని పొందలేని లేదా శృంగారంలో మెరుగ్గా పాల్గొనలేని వారు తీవ్ర మానసిక క్షోభకు కూడా గురవుతారు. సెక్సువల్ లైఫ్‌ మెరుగ్గా ఉంటేనే జీవితంలో హ్యాపీగా ఉండగలం. సెక్సువల్ లైఫ్‌ను రిప్రొడక్టివ్‌ ప్రాబ్లమ్స్‌ ఒక్కటే కాకుండా కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ప్రభావితం చేస్తాయి.

కీళ్ళ వాతం

అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజీ ఆర్థరైటిస్ ప్రకారం, కీళ్ళ వాతం లేదా ఆర్థరైటిస్ కారణంగా కలిగే నొప్పి, స్టిఫ్‌నెస్, అలసట వంటివి లైంగిక ఆనందాన్ని తగ్గించవచ్చు. ఆర్థరైటిస్ రోగుల్లో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఈ మానసిక సమస్యలతో కూడా రోగులు శృంగార జీవితాన్ని పూర్తిగా స్థాయిలో ఆస్వాదించలేరు. అలానే యాంటీ డిప్రెసెంట్స్ వంటి కొన్ని మందులు లైంగిక కోరిక లేదా సెక్స్ డ్రైవ్‌ను తగ్గించి, భావప్రాప్తిని పొందడం కష్టతరం చేయవచ్చు.

డిప్రెషన్

డిప్రెషన్ అనేది ఒక సాధారణ మానసిక ఆరోగ్య సమస్య, ఇది చాలా మందిని బాధిస్తుంది. డిప్రెషన్‌కు గురైనవారు చాలా విచారంగా, నిరాశగా ఉంటారు. అలానే వీరికి శృంగారంపై ఏమాత్రం ఆసక్తి లేకుండా పోతుంది. ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ సెక్సువల్ స్టామినా, కోరికలపై నేరుగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. డిప్రెషన్ శృంగార ఆలోచనలు, భావాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలానే ఇది మహిళలో యోని పొడిబారడానికి, పురుషులలో అంగస్తంభన లోపానికి దారితీస్తుంది. భావప్రాప్తిని త్వరగా పొందడం కూడా కష్టమైపోతుంది.

పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్

పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే మానసిక ఆరోగ్య సమస్య బాధాకరమైన లేదా ప్రాణాంతక సంఘటనలను అనుభవించిన వ్యక్తులలో అభివృద్ధి చెందుతుంది. ఈ సంఘటనలు ప్రమాదాలు, హింస లేదా లైంగిక వేధింపులు కావచ్చు. PTSD ఉన్న వ్యక్తులు ఈ సంఘటన గురించి తరచుగా భయపడతారు, ఆందోళన చెందుతారు, ఆలోచిస్తారు. సరిగా నిద్రకూడా పోలేరు. చిరాకుగా ఫీల్ అవుతూ ఇతరుల నుంచి దూరంగా ఉంటారు. PTSD లైంగిక జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా లైంగిక కోరికలు కలగకుండా అడ్డుకుంటుంది. నొప్పితో కూడిన సెక్స్, ఆర్గాజం చేరుకోవడంలో ఇబ్బంది, భాగస్వామితో ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం వంటి సమస్యలూ ఎదురవుతాయి.

మధుమేహం

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెప్పినట్లుగా, మధుమేహం ఉన్నవాళ్లలో లైంగిక శక్తి తగ్గిపోవడం సహజం. ముఖ్యంగా డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోలేకపోతే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి సెక్సువల్ డ్రైవ్ లేదా లైంగిక కోరిక మరింత తగ్గిపోతుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు నరాలు, రక్త నాళాలను దెబ్బతీస్తాయి, దీనివల్ల జననేంద్రియాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. మధుమేహం అలసట, మానసిక కల్లోలం, హార్మోన్ల అసమతుల్యతలకు కారణమవుతుంది, ఇవన్నీ లైంగిక కోరికను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమస్యలు ఫేస్ చేసేవారు మధుమేహాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

క్యాన్సర్

ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి లైంగిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్‌ రోగులలో తలెత్తే అలసట, ఒత్తిడి లైంగిక కోరికను తగ్గిస్తాయి. అయితే కొంతమంది వ్యక్తుల్లో లైంగిక కోరిక పెరిగే అవకాశం కూడా ఉంది.