Friday, September 27, 2024
HomeUncategorizedపూర్తి సురక్షితంగా దేశ సరిహద్దులు

పూర్తి సురక్షితంగా దేశ సరిహద్దులు

Date:

భారతదేశ సరిహద్దులు పూర్తి సురక్షితంగా ఉన్నాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌ ఏర్పాటుచేసిన సదస్సులో పాల్గొన్న ఆయన.. అగ్నివీర్‌ పథకంపై వస్తోన్న విమర్శలతో పాటు పలు అంశాలపై మాట్లాడారు. ఈసందర్భంగా తన 50 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో పలు విశేషాలను పంచుకున్నారు. భారత్‌-చైనా సరిహద్దు అంశంలో విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ.. తాను ఎన్నడూ ఇబ్బందికరంగా భావించలేదన్నారు.

‘దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, నేను చేయగలిగినదంతా వారికి (విపక్షాలకు) చెబుతాను. కానీ, రక్షణరంగంలో మాత్రం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిని బహిరంగంగా చెప్పలేం. మన సైన్యం, భద్రతా దళాలపై విశ్వాసం ఉండాలి. రక్షణ మంత్రిగా ఐదేళ్లు, అంతకుముందు హోం మంత్రిగా ఉన్నాను. నేను చూసిన, అర్థమైన, అంచనా వేసిన ఆధారంగా.. మన దేశం, దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమని హామీ ఇవ్వగలను’ అని రక్షణమంత్రి రామ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

సాయుధ బలగాల్లో యువతరం ఉండాలన్న వాదనను ప్రతిఒక్కరూ అంగీకరిస్తారు. మన జవాన్ల సరాసరి వయసు 30-50 ఏళ్లు. 18-20ఏళ్ల వయసులో అగ్నివీరులుగా చేరితే.. వారి పోరాట స్ఫూర్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇది సాంకేతిక యుగమని, దేశ యువత కూడా ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. అగ్నివీర్‌ పథకం ద్వారా అటువంటి వారిని సాయుధ బలగాల్లో తీసుకుంటున్నారని అన్నారు. వారి భవిష్యత్తుపై ఈ పథకం ఎలాంటి ప్రభావం చూపదని, ఇందుకోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందన్నారు.