Sunday, September 29, 2024
HomeUncategorizedనెస్లే బేబీ ఫుడ్స్‌లో చక్కెర, తేనె వాడుతున్నారు

నెస్లే బేబీ ఫుడ్స్‌లో చక్కెర, తేనె వాడుతున్నారు

Date:

చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడే నెస్లే ఇండియాకు చెందిన బేబీ ఫుడ్స్‌లో చక్కెర, తేనె వంటి పదార్థాలు వినియోగిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్వెస్టిగేషన్‌ ఆర్గనైజేషన్‌ ‘పబ్లిక్‌ ఐ’ దీనికి సంబంధించిన కొన్ని అంశాలను బయట పెట్టినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. తాజాగా నెస్లే ఇండియా దీనిపై వివరణ ఇచ్చింది. భారత్‌ సహా కొన్ని పేద దేశాల్లో నెస్లే విక్రయించే బేబీ ఫుడ్స్‌లో చక్కెర వినియోగం అధికంగా ఉంటోందని తమ పరిశోధనలో తేలినట్లు పబ్లిక్‌ ఐ పేర్కొంది. భారత్‌తో పోలిస్తే థాయ్‌లాండ్‌, ఇథియోపియాలో చక్కెర వినియోగం మరింత ఎక్కువగా ఉంటున్నట్లు తన నివేదికలో తెలిపింది.

తమ ఆహార ఉత్పత్తుల్లో చక్కెర వినియోగం గురించి వచ్చిన ఈ ఆరోపణలపై నెస్లే ఇండియా స్పందించింది. గడిచిన ఐదేళ్లుగా చక్కెర వినియోగాన్ని 30 శాతం మేర తగ్గించినట్లు ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు వివరణ ఇచ్చారు. ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను సమీక్షించుకుంటున్నామని తెలిపారు. నాణ్యత, రుచిలో విషయంలో రాజీ పడకుండా వీలైనంత వరకు చక్కెర స్థాయిలను మరింత తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వార్తల నేపథ్యంలో గురువారం నెస్లే ఇండియా షేరు ఓ దశలో 5 శాతం మేర క్షీణించింది. చివరికి 2.95 శాతం నష్టపోయి రూ.2,471 వద్ద ముగిసింది.