Thursday, October 10, 2024
HomeUncategorizedనా కుమార్తె, అల్లుడిని న‌దిలో తోసేయండి

నా కుమార్తె, అల్లుడిని న‌దిలో తోసేయండి

Date:

నమ్మక ద్రోహానికి పాల్పడిన తన కుమార్తె, అల్లుడిని ప్రాణహిత నదిలో తోసేయాలని మహారాష్ట్ర మంత్రి, సీనియర్ ఎన్‌సీపీ నేత ధర్మారావ్‌బాబా ఆత్రామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అహేరీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. మంత్రి కుమార్తె భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్‌ హాల్గేకర్.. శరద్‌ పవార్ వర్గం ఎన్‌సీపీలో చేరొచ్చన్న వార్తలపై మంత్రి మాట్లాడుతూ.. ”పార్టీలు వీడి కొందరు వెళ్తుంటారు. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని మా కుటుంబంలో కొందరు మరో పార్టీలో చేరాలని అనుకుంటున్నారు. శరద్‌పవార్ గ్రూప్ నాయకులు నా ఇంటిని ముక్కలు చేసి, నాపై నా కుమార్తెను పోటీకి నిలబెట్టాలని చూస్తున్నారు. నా కుమార్తె, అల్లుడిని నమ్మొద్దు. వారు నన్ను వదిలేశారు. వారిని ప్రాణహిత నదిలో తోసేయండి. ఒక తండ్రికి కుమార్తెగా ఉండలేకపోయిన అమ్మాయి.. మీ వ్యక్తి ఎలా అవుతుంది? ఆ విషయం గురించి మీరు ఆలోచించాలి. ఆమె మీకు ఎలాంటి న్యాయం చేస్తుంది..?” అని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు పక్కన ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా ఉన్నారు.

గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బిజెపి- శిందే సర్కారుకు మద్దతు పలికిన అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్‌సీపీగా ఎన్నికల సంఘం గుర్తించింది. శరద్‌పవార్‌ నేతృత్వంలోని వర్గాన్ని ఎన్‌సీపీ(ఎస్పీ)గా పిలుస్తున్నారు. మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్న అక్కడ రాజకీయ వాతావారణం వేడెక్కింది. ఇదే మంత్రి వ్యాఖ్యలకూ కారణమైంది.