Sunday, September 29, 2024
HomeUncategorizedనాగాలాండ్‌ 6 జిల్లాల్లో ఒక్కరూ ఓటు వెయ్యలే

నాగాలాండ్‌ 6 జిల్లాల్లో ఒక్కరూ ఓటు వెయ్యలే

Date:

నాగాలాండ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం 6 జిల్లాల్లో ‘సున్నా శాతం’ పోలింగ్‌ నమోదుకావడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. దీంతో ఎన్నికల సిబ్బంది తొమ్మిది గంటలపాటు నిరీక్షించి వెళ్లిపోయారు.

నాగాలాండ్‌లో ఆరు జిల్లాల పరిధిలో నాగా తెగకు చెందిన వారున్నారు. రాష్ట్రంలో మొత్తం 13.25 లక్షల ఓటర్లు ఉండగా.. ఈ ఆరు జిల్లాల్లో 4,00,632 మంది ఉన్నారు. 20 శాసనసభ స్థానాల పరిధిలో మొత్తంగా 738 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ సమయం కేటాయించినప్పటికీ.. ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకురాలేదు. 20 మంది ఎమ్మెల్యేలూ ఓటు హక్కును వినియోగించుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ప్రత్యేక రాష్ట్రం డిమాండు చేస్తూ నాగా తెగ ప్రజలు 2010 నుంచి పోరాటం చేస్తున్నారు. ఏడు గిరిజన తెగలు కలిసి ఈస్టర్న్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌గా ఏర్పడి తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ఎన్నోఏళ్లుగా తమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురయ్యిందని చెబుతోన్న ఈఎన్‌పీవో.. ఏప్రిల్‌ 18 సాయంత్రం నుంచే నిరవధిక బంద్‌ పాటించాలని ఇటీవల ప్రకటించింది. దీంతో పోలింగ్‌ రోజున లక్షల మంది ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారులు, అత్యవసర సేవలు మినహా రోడ్లపై ఏ ఒక్క వ్యక్తి, వాహనం కనిపించలేదు. అయినప్పటికీ అక్కడ శాంతియుత వాతావరణమే నెలకొందని అధికారులు వెల్లడించారు.

తాజా పరిణామంపై నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెయిఫియు రియో స్పందించారు. ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని.. ఫ్రంటియర్‌ నాగాలాండ్‌ టెరిటరీ స్వయంప్రతిపత్తి కల్పించాలని ఇప్పటికే సిఫార్సు చేశామన్నారు. అయితే, 20 మంది ఎమ్మెల్యేలూ ఓటు వేయకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాము ఘర్షణ కోరుకోవడం లేదని సీఎం రియో స్పష్టంచేశారు.

ఎన్నికల వేళ బంద్‌కు పిలుపునివ్వడాన్ని నాగాలాండ్‌ ఎన్నికల అధికారులు తప్పుపట్టారు. ఈఎన్‌పీవోకు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వయసన్‌ ఆర్‌ పేర్కొన్నారు. దీనిపై ఈఎన్‌పీవో అధ్యక్షుడు సపికియు సంగ్తం స్పందిస్తూ.. నోటీసుల్లో ఈసీ పేర్కొన్న సెక్షన్‌ ఈసందర్భంలో వర్తించదన్నారు.