Sunday, September 29, 2024
HomeUncategorizedదుబాయ్‌ ప్రయాణాలను వాయిదా వేసుకోండి

దుబాయ్‌ ప్రయాణాలను వాయిదా వేసుకోండి

Date:

దుబాయ్‌కు వచ్చేవారు, స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్‌ చేసుకోవాలని దుబాయ్‌లో వరదల నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. భారీ వరదల నేపథ్యంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఈ సూచనలు పాటించాలని తెలిపింది.

దుబాయ్‌తోపాటు సమీప ప్రాంతాలను ఇటీవల వరదలు ముంచెత్తాయి. ఊహించని వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఇన్‌బౌండ్‌ విమానాల సంఖ్యను పరిమితం చేసింది. కార్యకలాపాలు సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు యూఏఈ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విమానాలు బయలుదేరే తేదీ, సమయానికి సంబంధించి సదరు విమానయాన సంస్థ నుంచి ధ్రువీకరణ వచ్చిన తర్వాతే ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి’ అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. భారత పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపింది. ఏప్రిల్‌ 17 నుంచి ఇది అందుబాటులో ఉందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయమైన దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు మరో 24 గంటలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.