Friday, September 27, 2024
HomeUncategorizedతెలంగాణలో మండుతున్న ఎండలు

తెలంగాణలో మండుతున్న ఎండలు

Date:

రానున్న రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ విషయంపై ఐఎండీ ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. మొన్నటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఇప్పడు ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెదపల్లిలో జిల్లాల్లో రానున్న రోజుల్లో విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయని, ఈ రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్చి 27న కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మార్చి 28వతేదీన వీపరీతమైన వేడిగాలులు కొనసాగుతాయని అధికారులు అన్నారు. ఒక్క సోమవారం నాడే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అన్నారు. నల్గొండలోని తిమ్మాపూర్, భద్రాద్రి కొత్తగూడెంలోని సుజాతనగర్లో మార్చి 25న 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని షేక్ పేట్‌లో అత్యధికంగా 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఇక రానున్న ఐదురోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. తూర్పు, దక్షిణ తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నారాయణపేట వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని అన్నారు.