Friday, September 27, 2024
HomeUncategorizedతల్లి విజయమ్మ ఆశీర్వాదంతో జగన్ బస్సు యాత్ర

తల్లి విజయమ్మ ఆశీర్వాదంతో జగన్ బస్సు యాత్ర

Date:

ఏపీలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించి.. సర్వ మత ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ ఆశీర్వాదం అందించారు. 21 రోజులు ముఖ్యమంత్రి ప్రజలతోనే ఉండనున్నారు. అటు కూటమి నుంచి చంద్రబాబు ప్రచారం మొదలు పెట్టారు. పవన్ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారంలోకి దిగనున్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన ముహూర్తం మేరకు సరిగ్గా 10.56 గంటలకు తన నివాసం నుంచి ఎన్నికల ప్రచారానికి బయల్దేరారు. ప్రత్యేక హెలికాప్టర్ లో కడప చేరుకున్న జగన్.. ఇడుపులపాయలో తన తండ్రి ఘాట్ వద్ద నివాళి అర్పంచారు. తల్లి విజయమ్మతో పాటుగా పార్టీ నేతలు హాజరయ్యారు. రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద ప్రార్ధనలు నిర్వహించారు. ఆ తరువాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు ద్వారా తన ఎన్నికల యాత్ర ప్రారంభించారు. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర తొలి విడతలో భాగంగా 21 రోజులు నిర్వహించనున్నారు.

తొలి రోజు పర్యటనలో భాగంగా.. వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకొని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడినుంచి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డకు (వయా దువ్వూరు, చాగలమర్రి) కు చేరుకుని రాత్రికి బస చేస్తారు. ఈ పర్యటన సమయంలోనే జగన్ పలు వర్గాలకు చెందిన ప్రజలు, మేధావులు, యువతతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఈ అయిదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం గురించి వివరిస్తారు. పార్టీ పరిస్థితుల పైన కేడర్ తో మమేకం అయి వారితో సమీక్ష చేయనున్నారు. పార్టీ పరంగా ఎన్నికల సమయం తీసుకోవాల్సిన చర్యల పైన దిశా నిర్దేశం చేయనున్నారు. జగన్ యాత్రలో భాగంగా ప్రతీ పార్లమెంట్ పరిధిలో ఒక సభ నిర్వహించేలా ప్లాన్ చేసారు.