Friday, September 27, 2024
HomeUncategorizedచేతి పంపుతో దాహం తీర్చుకున్న ఏనుగులు

చేతి పంపుతో దాహం తీర్చుకున్న ఏనుగులు

Date:

ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలతో వాగులు, వంకలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు సైతం అడుగంటి పోతున్నాయి. నది తీర ప్రాంతాల్లోనూ నీటికష్టాలు తీవ్ర మవుతున్నాయి. ఇంకా అభయారణ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. జనం జలమో రామచంద్రా అంటుంటే అభయారణ్యంలోని ఈ వన్య ప్రాణులు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. దాహం తీర్చుకునేందుకు మెదడుకు పని చెప్పి భళా అనిపించుకుంటున్నాయి. స్వయంగా చేతి పంపును కొడుతూ దాహం తీర్చుకుంటున్నాయి.

మహారాష్ట్రలోని గడ్జిరోలి జిల్లా కమలాపూర్‌ సమీపంలో గల ఏనుగుల క్యాంప్‌లోని రూప అనే ఏనుగు వేసవి తాపానికి తాళలేక దాహం తీర్చుకునేందుకు చేతిపంపును తొండంతో కొడుతూ భళా అనిపించుకుంది. అచ్చం మనుషుల్లానే తొండంతో చేతి పంపు హ్యాండిల్‌ను కొడుతూ నీరు తాగి తన దాహాన్ని తీర్చుకుంది. ఒక్క ఏనుగే కాదు అదే ప్రాంతంలోని సమీప గ్రామాల్లో ఓ బర్రెల మందలోని ఓ బర్రె సైతం తన ఆలోచనకు పదును పెట్టి ఆశ్చర్య పరిచింది. స్థానికంగా ఉన్న ఓ చేతి పంపును ఆశ్రయించి దాహం తీర్చుకుంది. ఈ వీడియోలని చూసిన ప్రతి ఒక్కరూ మూగ జీవాలకు ఎంత తెలివో అంటూ ఆశ్చర్య పోతున్నారు.