దేశ వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన కొత్త నేర, న్యాయ చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్ 281 బీఎన్ఎస్, ఎంవీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్‌ను డిజిటల్‌గా నమోదు చేశారు.
దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టం స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు, ఎస్సెమ్మెస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయవ్యవస్థలోకి ప్రవేశిస్తున్నాయి.