Friday, September 27, 2024
HomeUncategorizedకేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా స్పందన

కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా స్పందన

Date:

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. దీనిపై తాజాగా అమెరికా నుంచి స్పందన వచ్చింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది.

కేజ్రీవాల్‌ అరెస్టుపై ఈ-మెయిల్‌లో అడిగిన ఓ ప్రశ్నకు యూఎస్ అధికార ప్రతినిధి బదులిస్తూ.. ”సమయానుకూల, పారదర్శక న్యాయప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నాం” అని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై ఇటీవల జర్మనీ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ”భారత్‌ ప్రజాస్వామ్య దేశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జర్మనీ స్పందనపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు పంపింది. దాంతో జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్‌ జార్జ్‌ ఎంజ్‌వీలర్‌ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఆయన వద్ద భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటని మండిపడింది.