Friday, September 27, 2024
HomeUncategorizedకేజ్రివాల్ కు అమెరికా మద్దతుపై కేంద్రం ఆగ్రహం

కేజ్రివాల్ కు అమెరికా మద్దతుపై కేంద్రం ఆగ్రహం

Date:

అంతర్జాతీయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అరెస్టుపై వస్తున్న మద్దతుపై కేంద్రం గుర్రుగా ఉంది. కేజ్రివాల్ అరెస్టు నేపథ్యంలో విచారణ పారదర్శకంగా ఉండేలా చూడాలంటూ అమెరికా ఇచ్చిన సలహాపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తీరుపై మండిపడిన భారత విదేశాంగశాఖ ఢిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు పంపింది. ఇప్పటికే కేజ్రివాల్ కు జర్మనీ మద్దతుపై రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసిన భారత్… ఇప్పుడు అమెరికా రాయబారిని పిలిపించడం విశేషం. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. ఢిల్లీలోని తన కార్యాలయంలో 40 నిమిషాల సమావేశానికి అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను పిలిచింది. కొద్దిసేపటి తర్వాత విడుదల చేసిన సంక్షిప్త ప్రకటనలో అనారోగ్యకర సంప్రదాయాలపై హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. ప్రతీ దేశం ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని భావిస్తున్నట్లు తెలిపింది. తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కాబట్టి తాజా పరిణామాలు అనారోగ్యకరమైన సంప్రదాయాలను నెలకొల్పుతాయని వెల్లడించింది.

భారత్ లో న్యాయప్రక్రియ స్వతంత్ర న్యాయ వ్యవస్ధపై ఆధారపడి ఉంటుందని, ఇది దాని లక్ష్యంతో పాటు సమయానుకూల ఫలితాలకు కట్టుబడి ఉంటుందని వెల్లడించింది. కాబట్టి దీనిపై వ్యాఖ్యలు చేయడం అసంబద్ధమని పేర్కొంది. తద్వారా తన అభ్యంతరాలను అమెరికాకు తెలిపింది. అంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను అమెరికా ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడికి “న్యాయమైన, పారదర్శక మరియు సమయానుకూల న్యాయ ప్రక్రియ” ఉండేలా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి రాయిటర్స్‌తో చెప్పారు.