ఇద్దరు కూతుర్లతో కలిసి భార్యాభర్తలు పెళ్లికి వెళ్లారు. అక్కడకు చేరుకున్న తర్వాత భార్య, పెద్ద కూతురు కారు నుంచి దిగారు. ఇద్దరు కుమార్తెలు కారు దిగి తల్లితో కలిసి ఫంక్షన్ హాల్‌లోకి వెళ్లి ఉంటారని భావించిన ప్రదీప్ కారును ఒక చోట పార్క్ చేసి డోర్ లాక్ చేశాడు. తర్వాత అతడు కూడా లోపలకు వెళ్లాడు. వారిద్దరూ విడివిడిగా సుమారు రెండు గంటలపాటు పెళ్లికి హాజరైన వారిని కలిసి ముచ్చటించారు. మరోవైపు చివరకు కలుసుకున్న భార్యాభర్తలు మూడేళ్ల చిన్న కుమార్తె గోర్విక కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఆ చిన్నారి గురించి అక్కడ వెతికారు. మూడు గంటల తర్వాత పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లారు. డోర్ తెరిచి చూడగా వెనుక సీటులో అచేతనంగా పడి ఉన్న గోర్వికను చూశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఊపిరాడక ఆ చిన్నారి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. అయితే కుమార్తె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు పేరెంట్స్ నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ సంఘటనపై ఫిర్యాదు కూడా చేయలేదని వెల్లడించారు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌లోని కోటాలో జరిగింది.