Sunday, September 29, 2024
HomeUncategorizedకావాలనే మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారు

కావాలనే మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారు

Date:

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్‌ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. టీలో ఎక్కువ పంచదార వంటి చర్యల ద్వారా షుగర్ లెవల్స్‌ పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. తన బ్లడ్ షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన షుగర్ లెవల్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తన వైద్యుడ్ని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈడీ తరుఫు న్యాయవాది జోహెబ్ హొస్సేన్ కోర్టులో వాదనలు వినిపించారు. షుగర్ లెవల్స్‌ పెంచుకునేందుకు కేజ్రీవాల్‌ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఆరోపించారు. షుగర్ లెవల్స్‌ హెచ్చుతగ్గుల సాకుతో బెయిల్‌ కోరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కోర్టుకు తెలిపారు. మరోవైపు ఈడీ న్యాయవాది జోహెబ్ వ్యాఖ్యలపై అరవింద్‌ కేజ్రీవాల్ తరపు న్యాయవాది వివేక్ జైన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియాను ఆకట్టుకునేందుకు ఈడీ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని సరైన పిటిషన్‌ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో కేజ్రీవాల్ డైట్‌కు సంబంధించి మెడికల్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.