Friday, September 27, 2024
HomeUncategorizedకాలేజీ విద్యార్థి ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు

కాలేజీ విద్యార్థి ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు

Date:

ప్రతి రోజు కాలేజీకి వెళ్లి చదువుకునే విద్యార్థి బ్యాంకు ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన ఆదాయపు పన్ను అధికారులు సదరు విద్యార్థికి ఆదాయపు పన్ను నోటీసులు పంపారు. నోటిసులు రావడంతో ఆశ్చర్యపోయిన ఆ విద్యార్థి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. 

గ్వాలియర్‌కు చెందిన ప్రమోద్‌ కుమార్‌ దండోటియా స్థానిక కళాశాలలో చదువుకుంటున్నాడు. ఇటీవల అతడికి ఐటీ, జీఎస్‌టీ నుంచి పన్ను నోటీసులు వచ్చాయి. అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయని, అందుకు గానూ పన్ను చెల్లించాలనేది వాటి సారాంశం. దీంతో ఆ విద్యార్థి సంబంధిత అధికారులను సంప్రదించగా తన పాన్‌ కార్డుపై ఓ కంపెనీ రిజిస్టర్‌ అయినట్లు తెలిసింది.

ఆ కంపెనీ 2021 నుంచి ముంబయి, దిల్లీ వేదికగా కార్యకలాపాలు సాగించిందని తెలుసుకున్న అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ కంపెనీ గురించి తనకు తెలియదని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ”ఆ విద్యార్థి పాన్‌ కార్డును గుర్తుతెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి కంపెనీని రిజిస్టర్‌ చేశారు. ఆ తర్వాతే అతడి బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది” అని పోలీసులు వెల్లడించారు.