Saturday, September 28, 2024
HomeUncategorizedకాంగ్రెస్ నాయకులు చేతకాని దద్దమ్మలు

కాంగ్రెస్ నాయకులు చేతకాని దద్దమ్మలు

Date:

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిందని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ వారిని వెంటాడుతామని హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. పలు గ్రామాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించారు. రైతుల కష్టాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం పట్టించిందని మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను నిండా మోసం చేశారని విమర్శలు గుప్పించారు.

గోదావరి నది 200 కి.మీ. మేర సజీవ జలధార కనిపించేది. గత 8 సంవత్సరాలు ప్రజలు ఆ ఫలాలను అనుభవించారు. ఇప్పుడు 4 నెలల్లోనే ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూస్తున్నాం. 2014కు ముందు ఏ పరిస్థితి ఉండేదో ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి చూస్తున్నాం. ఈ ప్రభుత్వ అసమర్థ, తెలివి తక్కువతనం వల్లే ఈ దుస్థితి. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. తులం బంగారం వస్తదని కొందరు మోసపోయారు. 4వేల పెన్షన్ వస్తుందని వృద్ధులు మోసపోయారు. స్కూటీలకు ఆశపడి యువతులు మోసపోయారు. 2 లక్షల రుణమాఫీ వస్తుందని రైతులు మోసపోయారు. ఇలా ఎన్నో హామీలు ఇచ్చి..ప్రజలంతా మోసపోయారు. మా కంటే 1.8శాతం మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చాయి. గతం కంటే ఇప్పడు ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ ఎందుకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. 9 ఏళ్లు నిరంతరాయంగా వచ్చిన విద్యుత్ ఇప్పుడెందుకు రావడం లేదు. మీరు చేతకాని దద్దమ్మలు. ప్రభుత్వాన్ని నడపడం చేతకాదు.” అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ నేతలకు అసలేమీ తెలియదని విరుచుకుపడ్డారు కేసీఆర్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంపెనీ వల్లే మిడ్ మానేరు కట్ట కొట్టుకుపోయిందని విమర్శించారు. మీ తెలివితక్కువ తనం వల్లే ఎడారిగా మారిందని అన్నారు. మేడిగడ్డ వద్ద 300 పిల్లర్లతో బరాజ్ కట్టామని.. ఒక మూడు పిల్లర్లు కుంగిపోతే మాత్రాన బరాజ్ మొత్తం కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తనను బద్నాం చేసేందుకే నీళ్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా.. అవన్నీ ప్రజలకు తెలుసునని.. వాళ్లే కర్రుకాల్చి వాతపెడతారని విరుచుకుపడ్డారు. గోదావరిలో 20వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చాక.. 50వేల మంది రైతులతో స్వయంగా తానే వెళ్లి… నీళ్లును ఎత్తిపోస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రం రణరంగమయినా సరే..తాము అనుకున్నది చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు.. ఉచితంగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాలని కెసిఆర్ డిమాండ్ చేశారు.