దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ఐదు ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్థులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జాబ్ ఇంటర్వ్యూలో తొక్కిసలాట లాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 9న అంకలేశ్వర్‌లోని హోటల్ లార్డ్స్ ప్లాజాలో ఒక కెమికల్ సంస్థ వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. షిఫ్ట్ ఇన్‌ఛార్జ్, ప్లాంట్ ఆపరేటర్, సూపర్‌వైజర్, ఫిట్టర్, మెకానికల్, ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం వేలాదిమంది నిరుద్యోగ యువత తరలివచ్చారు.
రెజ్యూమ్ కాపీలను చేతుల్లో పట్టుకున్న అభ్యర్థులు క్యూలో వేచి ఉన్నారు. హోటల్ గేటు నుంచి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరగడంతో తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా రైలింగ్ ఒంగిపోగా దాని పై నుంచి కొందరు కిందపడ్డారు. ఈ నేపథ్యంలో గందరగోళానికి దారితీసింది.