Friday, September 27, 2024
HomeUncategorizedఐటీ నోటీసులపై మండిపడుతున్న కాంగ్రెస్

ఐటీ నోటీసులపై మండిపడుతున్న కాంగ్రెస్

Date:

కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మళ్లీ నోటీసులు పంపింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. తమపై ఐటీ చర్యలను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన వెంటనే.. కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు జారీ చేసింది. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1823 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఎన్నికల్లో డబ్బు లేదని ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్న సమయంలో మరోసారి ఐటీ నోటీసులు ఇవ్వడంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ శాఖ నోటీసులను నిరసిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిరసనలకు పిలుపునిచ్చింది. శనివారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర విభాగాలను కోరారు. పీసీసీ ప్రధాన కార్యాలయాల దగ్గర, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యాలయాల దగ్గర ధర్నా చేయాలని అధిష్టానం ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఇలా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది.

2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో శుక్రవారం 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1800 కోట్లకుపైగా డిమాండ్‌ నోటీసులను ఐటీ పంపించింది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్‌కు మద్దతుగా ఆదివారం ఢిల్లీలో ఇండియా కూటమి మహా ర్యాలీకి సిద్ధపడింది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసుల నుంచి అనుమతి లభించినట్లు సమాచారం. అన్ని పార్టీలకు చెందిన నేతలు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్‌ను అమెరికా సహా ఐక్యరాజ్యసమితి తప్పుపట్టింది. ఇక తమ దేశ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్రం స్పష్టం చేసింది.