Friday, September 27, 2024
HomeUncategorizedఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు

ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు

Date:

ఏపీలో క్షేత్రస్ధాయి పరిస్ధితులపై వస్తున్న రిపోర్టులపై చర్యలు తీసుకోవడం లేదని విపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల్ని పంపాలని ఈసీ నిర్ణయించింది. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం తెలిపారు. 1987 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐఏఎస్ రామ్ మోహన్ మిశ్రాను ప్రత్యేక సాధారణ పరిశీలకుడిగానూ, 1984 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐపీఎస్ దీపక్ మిశ్రాను ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగానూ, 1983 బ్యాక్ కి చెందిన రిటైర్డు ఐఆర్ఎస్ అధికారిణి నీనా నిగమ్ ను ప్రత్యేక వ్యయ పరిశీలకురాలిగా నియమించినట్లు తెలిపారు.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి ఈసీ నుంచి సమాచారం అందింది. ఈ ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే భేటీకి హాజరవుతున్నారన్నారు. ఈ ముగ్గురు రాష్ట్ర పత్యేక పరిశీలకులు వచ్చే వారం నుండి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను వీరు పరిశీలిస్తారు. అలాగే ఎన్నికల నిర్వహణలో ఈసీ మార్గదర్శకాలను పటిష్టంగా అమలు పరుస్తారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే, ప్రేరేపించే తాయిలాల నియంత్రణపై కూడా ఈ పరిశీలకులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అలాగే జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, లా ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలతో ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశాల్లో వీరు పాల్గొని, వారి అనుభవాలను, సూచలను, సలహాలను ఇస్తారని సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు.