Friday, September 27, 2024
HomeUncategorizedఎన్నికల ఖర్చుకు డబ్బుల్లేవు.. అందుకే పోటీ చేయట్లేదు

ఎన్నికల ఖర్చుకు డబ్బుల్లేవు.. అందుకే పోటీ చేయట్లేదు

Date:

దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన డబ్బులు తన దగ్గర లేవని, అందుకే తాను పోటీ చేయడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న బీజేపీ ప్రతిపాదనను తిరసర్కించానని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారని చెప్పారు. 

‘టైమ్స్ నౌ సమ్మిట్ 2024’లో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ”బీజేపీ నన్ను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరింది. వారం, పది రోజులు ఆలోచించిన తరువాత ‘కుదరకపోవచ్చు’ అని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా నాకు ఒక సమస్య ఉంది. ఆ ప్రాంతంలో కులం, మతం వంటి అంశాలు గెలుపులో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అవన్నీ నేను చేయగలనని అనుకోవడం లేదు. అందుకే వద్దని చెప్పాను. వారు నా వాదనను అంగీకరించారు. నేను చాలా కృతజ్ఞురాలిని. అందుకే తాను పోటీ చేయడం లేదు” అని అన్నారు.

దేశ ఆర్థిక మంత్రి వద్ద ఎన్నికల్లో పోటీ చేయడానికి సరిపడా నిధులు ఎందుకు లేవని ప్రశ్నించగా.. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా తనది కాదన్నారు. ”నా జీతం, నా సంపాదన, నా పొదుపు మాత్రమే నావి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నాది కాదు” అని అన్నారు.

ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్న లోక్ సభ ఎన్నికల్లో అధికార బీజేపీ ఇప్పటికే ఉన్న పలువురు రాజ్యసభ సభ్యులను బరిలోకి దింపింది. వీరిలో పీయూష్ గోయల్, భూపేందర్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్, మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెను కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ సూచించినా.. దానిని తిరస్కరించారు. ఇతర అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారమన్ వెల్లడించారు. తాను చాలా మీడియా కార్యక్రమాలకు హాజరవుతానని, అభ్యర్థులతో కలిసి కూడా ప్రచారంలో పాల్గొంటానని వెల్లడించారు.