Sunday, September 29, 2024
HomeUncategorizedఎన్నికల్లో ఏలాంటి అనుమానాలకు తావివ్వొద్దు

ఎన్నికల్లో ఏలాంటి అనుమానాలకు తావివ్వొద్దు

Date:

దేశ వ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతున్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్‌లను క్రాస్‌ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి ఆరా తీసింది. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ పవిత్రంగా ఉండాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆశించినది జరగడం లేదని ఎవరూ భయపడవద్దు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం పేర్కొంది.

పిటిషనర్ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఇటీవల కేరళలో జరిగిన మాక్‌ పోల్‌ గురించి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాసర్‌గోడ్‌లో మాక్‌ ఓటింగ్‌ జరిగిందని.. అక్కడ నాలుగు ఈవీఎంలను వీవీప్యాట్లతో సరిపోలిస్తే బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో పవిత్రత అవసరం అని.. అనుకున్న విధంగా జరగడం లేదని ఎవరూ ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పారదర్శక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలాంటి విధానాలను పాటిస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీంతో ఎన్నికల సంఘం తమ ప్రక్రియను న్యాయస్థానానికి వివరించింది.