Sunday, September 29, 2024
HomeUncategorized'ఇండియా' కూటమి చరిత్ర అంతా కుంభకోణాలే

‘ఇండియా’ కూటమి చరిత్ర అంతా కుంభకోణాలే

Date:

దేశ, విదేశాల్లోని శక్తిమంతులైన వ్యక్తులు నన్ను అధికారం నుంచి తొలగించేందుకు ఏకమయ్యారు. కానీ.. నారీ, మాతృశక్తుల ఆశీర్వాదంతో వారితో పోరాడగలుగుతున్నాను. మహిళల భద్రతే నా ప్రాధాన్యం” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో నిర్వహించిన ప్రచార సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. ”మాతృమూర్తులు, సోదరీమణులు ఇక్కడికి పెద్దసంఖ్యలో వచ్చారు. కుటుంబపోషణలో భాగంగా మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు, చేస్తోన్న పోరాటం గురించి తెలుసు అన్నారు.

ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో దిశానిర్దేశం చేసేందుకు ఒక్క నాయకుడూ లేడని ప్రధాని మోడీ ఈసందర్భంగా ఎద్దేవా చేశారు. అందులోని భాగస్వామ్య పక్షాలకు ఎటువంటి భవిష్యత్తు కార్యాచరణ లేదని, వాటి చరిత్ర అంతా కుంభకోణాలతో నిండిఉందని విమర్శలు గుప్పించారు. 102 స్థానాల్లో శుక్రవారం నిర్వహించిన తొలిదశ పోలింగ్‌.. ఎన్డీయే, ‘వికసిత్‌ భారత్‌’కు అనుకూలంగా సాగిందని చెప్పారు. సభలో భాగంగా వేదిక పంచుకున్న మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవగౌడపై మోడీ ప్రశంసలు కురిపించారు. 90 ఏళ్లలోనూ ఆయన ఉత్సాహం, నిబద్ధత తనలో స్ఫూర్తి నింపినట్లు తెలిపారు. జేడీఎస్‌ గతేడాది సెప్టెంబరులో ఎన్డీయేలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా.. మొత్తం 28 స్థానాలున్న కర్ణాటకలో రెండు విడతల్లో (ఏప్రిల్‌ 26, మే 7) పోలింగ్‌ నిర్వహించనున్నారు.