Sunday, September 29, 2024
HomeUncategorizedఅరటి ఆకులతో పోలింగ్ కేంద్రం ముస్తాబు

అరటి ఆకులతో పోలింగ్ కేంద్రం ముస్తాబు

Date:

మండే ఎండలు, మరో పక్క దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి.. భానుడి ప్రతాపానికి మండుటెండల్లో క్యూలో నిలబడి ఓటు వేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఈనేపథ్యంలోనే ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం చేసిన వినూత్న ఆలోచన అందరినీ ఆకర్షిస్తోంది.

ఎండ నుంచి ఉపశమనం కోసం తిరుపత్తూరు జిల్లాలోని పోలింగ్‌ బూత్‌ ఎదుట కొబ్బరి, వెదురు, అరటి ఆకులతో పందిరి వేసి అందంగా ముస్తాబు చేశారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఎలాంటి ఇబ్బందిలేకుండా వృద్ధులు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్‌ అధికారిణి సుప్రియసాహు ‘ఎక్స్’లో షేర్‌ చేశారు. ”ఎండ, వడగాల్పుల నుంచి ఓటర్లకు ఉపశమనం కలిగించేలా.. పర్యావరణం కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలోని యువకులతో కలిసి జిల్లా యంత్రాంగం గ్రీన్‌ పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేసింది. పచ్చని తోరణాలు ఓటర్లకు స్వాగతం పలికాయి” అని పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకొంది. ”అద్భుతమైన చొరవ. ఈ ఆలోచన అదుర్స్” అని ఒకరు.. ”చూడటానికి ఎంతో అందంగా ఉంది. చాలా బాగా అలంకరించారు. ఈ గొప్ప ప్రయత్నానికి ధన్యవాదాలు” అని మరొకరు కామెంట్‌ చేశారు.