ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉగ్ర ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. వెంటనే దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థ నుంచి ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది. కేవలం ఆగస్టు 15 నాడే ఈ దాడి జరుగుతుందని చెప్పలేమని, పంద్రాగస్టు వేడుకల సందర్భంగా భద్రత పటిష్టంగా ఉండటంతో రెండ్రోజుల తర్వాత కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదుల సంభాషణలను నిఘా వర్గాలు వినడంతో ఈ విషయం బయటపడింది. ఇప్పటికే పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ పంజాబ్‌లోని గ్యాంగ్‌స్టర్లు, అతివాదులు, ఉగ్రవాదులతో స్థానికంగా జరిగే స్వాతంత్ర్య వేడుకలు, అమర్‌నాథ్ యాత్రకు ఆటంకం కలిగించేలా పథకాన్ని రచిస్తున్నట్లు కూడా భద్రతా వర్గాల చెబుతున్నాయి.
ఇటీవల పరిణామాలను చూస్తే కథువా, దోడా, ఉధంపూర్, రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో ఉగ్ర కదలికలున్నట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. కాగా జమ్మూలోని దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. అత్యాధునిక ఎం4 రైఫిల్‌ను స్వాధీనం చేసుకొన్నాయి. వీటితోపాటు మూడు బ్యాక్‌ప్యాక్ బ్యాగ్‌లను ఆ ప్రాంతంలో గుర్తించారు. మంగళవారం రాత్రి ఇక్కడి అక్రా అటవీ ప్రాంతంలోని నదీ పరీవాహక ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ మొదలైంది. అమెరికా తయారీ ఎం4 కార్బైన్‌ను ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. నాటో దళాలు వాడే ఎం16ఏ2కు ఇది తేలికపాటి రకం. 2.5 కేజీల బరువు ఉంటుంది. పొట్టి బ్యారెల్‌తో వేగంగా కదలడానికి అనువైంది. 2021లో అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా దళాలు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను వదిలి వెళ్లిపోయారు. వాటిని పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థలైన లష్కరే, జైషేలు తాలిబన్ల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. అవి గత కొంత కాలంగా మెల్లమెల్లగా పాక్ నుంచి కశ్మీర్‌లోకి చేరుతున్నాయి.