Tuesday, October 15, 2024
HomeUncategorizedస్వ‌చ్ఛందంగా పేర్లు ప్ర‌ద‌ర్శిస్తే ఓకే

స్వ‌చ్ఛందంగా పేర్లు ప్ర‌ద‌ర్శిస్తే ఓకే

Date:

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు దుకాణాలపై యజమానులు, సిబ్బంది పేర్లు ప్రదర్శించాలని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలవగా జులై 22న సుప్రీం విచారించి మధ్యంతర స్టే విధించింది. తాజాగా జస్టిస్ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ ఎన్‌వీఎన్‌ భట్‌ల ధర్మాసనం మధ్యంతర స్టేను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గత ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగానే పేర్లను బహిర్గతం చేయమని ఎవరినీ బలవంతం చేయలేమని ధర్మాసనం పేర్కొంది. ఎవరైనా యజమానులు స్వచ్ఛందంగా పేర్లను ప్రదర్శించాలనుకుంటే వారిని ఆపేందుకు ఎవరూ బలవంతం చేయకూడదనే ఉద్దేశంతోనే స్టేను విధించామని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తమ స్పందనలు దాఖలు చేయాలని ప్రభుత్వాలను కోరింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసే ప్రత్యుత్తరాలపై తమ స్పందనలు నివేదించేందుకు పిటిషనర్లకు అనుమతిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 5కి వాయిదా వేసింది. కావడి యాత్రలో దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలనే ఆదేశాలను వ్యతిరేకిస్తూ తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా, ప్రొఫెసర్‌ అపూర్వానంద్‌, కాలమిస్ట్‌ ఆకర్‌ పటేల్‌ తదితరులు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. కావడి యాత్ర శాంతియుతంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థించుకుంటూ సుప్రీంకోర్టులో వివరించింది.