Thursday, October 10, 2024
HomeUncategorizedసుప్రీంకోర్టు ఆదేశించినా.. ఆగ‌ని ఆందోళ‌న‌లు

సుప్రీంకోర్టు ఆదేశించినా.. ఆగ‌ని ఆందోళ‌న‌లు

Date:

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలికి న్యాయం చేయాల‌ని వైద్యులు నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. నిరసన చేస్తున్న వైద్యులు నేటి సాయంత్రంలోగా విధుల్లో చేరాలని సుప్రీం కోర్టు ఆదేశించినా.. ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తేలేదంటూ వైద్యులు చెబుతున్నారు. మా డిమాండ్లు నెరవేరేంత వరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌, ఆరోగ్య కార్యదర్శి, హెల్త్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌, వైద్య విద్య డైరెక్టర్‌లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాము. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి” అని వైద్యులు తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటనపై ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదికను పరిశీలించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో వైద్యుల నిరసనలతో ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారని అందులో తెలిపింది. మరోవైపు, కేసు దర్యాప్తుపై కొత్తగా మరో నివేదిక ఇవ్వాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. అదే విధంగా వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా ఆందోళనలు చేస్తున్న వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లోకి చేరాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని ధర్మాసనం హెచ్చరించింది. ఏ నిరసన అయినా, ఆందోళనలు అయినా.. విధులను విస్మరించి చేయడం సరికాదని.. తక్షణమే విధుల్లోకి చేరి రోగులకు సేవలందించాలని సూచించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధులకు హాజరైన వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని.. నిరసనలు కొనసాగిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. న్యాయస్థానం విధించిన డెడ్‌లైన్‌ పూర్తి అయినా.. వైద్యులు మాత్రం ఇంకా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఆందోళనలను కొనసాగిస్తామని వైద్యులు తేల్చి చెప్పారు.