దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో శుక్రవారం బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్’ను ప్రదర్శించారు. సాయంత్రం 4.15 గంటల నుంచి ఈ సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్, ఆ చిత్ర దర్శకురాలు కిరణ్ రావ్ ఆ సినిమాను వీక్షించేందుకు సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమిర్ వస్తున్నట్లు ప్రకటించిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సరదా వ్యాఖ్యలు చేశారు. ”కోర్టులో తొక్కిసలాట తరహా పరిస్థితిని నేను కోరుకోను. కానీ ఈరోజు ఇక్కడ ఆమిర్ ఉన్నారు..” అంటూ చమత్కరించారు. ఈ సినిమాను సీజేఐ, ఇతర న్యాయమూర్తులు, వారి కుటుంబాలు, ఇతర సిబ్బంది వీక్షిస్తున్నారు. తన చిత్రాలతో సామాజిక అంశాలను లేవనెత్తే ఆమిర్ సొంత బ్యానర్‌పై ‘లాపతా లేడీస్ తెరకెక్కిన విషయం తెలిసిందే.
2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఇతివృత్తంగా దీన్ని తెరకెక్కించారు. లింగ సమానత్వాన్ని చాటిచెప్పే ఈ కామెడీ డ్రామా ఫిల్మ్.. ఈ ఏడాది మార్చిలో విడుదలై సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనా ఓటీటీలో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా విడుదలకు ముందుగానే సెప్టెంబరు 8న ఈ సినిమాను ప్రతిష్ఠాత్మక టోరంటో ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్‌ఎఫ్) వేడుకలో ప్రదర్శించారు. ఈ వినోదభరితమైన చిత్రంలో నితాన్షీ గోయల్, ప్రతిభా రంతా, స్పర్శ్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవికిషన్ కీలక పాత్రలు పోషించారు.