Saturday, November 9, 2024
HomeUncategorizedసీఎం రాజీనామా చేయాలంటూ విద్యార్థుల‌ భారీ ర్యాలీ

సీఎం రాజీనామా చేయాలంటూ విద్యార్థుల‌ భారీ ర్యాలీ

Date:

ప‌శ్చిమ బెంగాల్ కోల్‌క‌త్తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం ‘పశ్చిమబంగా ఛాత్రో సమాజ్‌’ మంగళవారం నిరసన చేపట్టింది. ‘నబన్నా అభియాన్’ పేరుతో హావ్‌డా నుంచి విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు. అయితే, వీరిని పోలీసులు అడ్డుకోవడంతో హావ్‌డాలోని సంతర్‌గాచి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చ్‌లో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. కొన్నింటిని లాగి పడేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వీరిపై బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జ్‌ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళన నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఎలాంటి అభ్యర్థన రాలేదని పోలీసులు తెలిపారు.

నలుగురు విద్యార్థుల అరెస్టు..

మార్చ్ జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఆ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో అదృశ్యమయ్యారని భాజపా నేత సువేందు అధికారి ఆరోపించారు. విద్యార్థులు మిస్‌ అయ్యారంటూ కొందరు రాజకీయ నేతలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని బెంగాల్‌ పోలీసులు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎవరూ అదృశ్యం కాలేదన్నది నిజమని తెలిపారు. దీనికి సువేందు బదులిస్తూ.. ”ఆ విద్యార్థుల కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. మమతా పోలీస్‌.. కోర్టులో కలుద్దాం” అని పోస్టు పెట్టారు.

ఈ ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కోల్‌కతా పోలీసు విభాగం 6 వేలమందిని మోహరించింది. అలాగే ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు అప్పగించింది. హేస్టింగ్స్‌లోని ఫోర్ట్ విలియం గేట్లకు సివిక్ వాలంటీర్లు గ్రీజ్‌ పూసిన దృశ్యాలు మీడియాలో వెలుగులోకివచ్చాయి. నిరసనకారుల్ని అడ్డుకునేందుకు అధికారులు ఈ విధంగా చేశారు. ఈ మార్చ్ నేపథ్యంలో ప్రజాజీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. నబన్నా(సచివాలయం) ర్యాలీ భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరేపితమని వామపక్ష నాయకురాలు బృందాకారాట్ తీవ్ర విమర్శలు చేశారు.