Thursday, October 10, 2024
HomeUncategorizedసిక్కు వ‌ర్గంలో రాహుల్ అస‌త్య ప్ర‌చారం

సిక్కు వ‌ర్గంలో రాహుల్ అస‌త్య ప్ర‌చారం

Date:

కాంగ్రెస్ ఆగ్ర‌నేత రాహుల్ గాంధీ భారత్‌లో రాజకీయాల కంటే మత స్వేచ్ఛపైనే పోరాటం కొనసాగుతోందని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ సందర్భంగా ఓ వర్గాన్ని ప్రస్తావించడం ఇందుకు కారణమైంది. సున్నితమైన అంశాలపై మాట్లాడుతూ ప్రమాదకర వాతావరణాన్ని సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని బిజెపి మండిపడింది. విదేశాల్లో నివసిస్తున్న సిక్కు వర్గంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. చరిత్రలో మా వర్గం ఒక్కసారైనా ఆందోళన, అభద్రత, అస్తిత్వ ముప్పు ఎదుర్కొన్నదంటే.. అది కేవలం గాంధీ కుటుంబం అధికారంలో ఉన్న సమయంలోనే. ఇళ్ల నుంచి అమాయకులను బయటకు తీసుకువచ్చి.. టైర్లు వేసి సజీవ దహనం చేశారు. నాటి దాడుల్లో 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు” అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

బిజెపి నేత ఆర్‌పీ సింగ్‌ మాట్లాడుతూ.. సిక్కుల గురించి రాహుల్‌ గాంధీ అమెరికాలో ఏం మాట్లాడారో వాటినే భారత్‌లో పునరావృతం చేయగలరా? అని సవాల్‌ విసిరారు. అలా చేస్తే ప్రతిపక్ష నేతపై కేసు వేసి కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. మరో కేంద్ర మంత్రి శివ రాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని వాజ్‌పేయీ విపక్షంలో ఉన్నప్పుడు కూడా దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేయలేదన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలో భారతీయ సంతతి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ.. కొన్ని వర్గాలు, భాషలు, మతాలను ఆర్‌ఎస్‌ఎస్‌ అభద్రతా భావానికి గురిచేస్తోందని ఆరోపించారు. ఇలా భారత్‌లో మత స్వేచ్ఛపైనే పోరాటం జరుగుతోందని, రాజకీయాల గురించి కాదన్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ చేసిన ఉదాహరణలు తాజా దుమారానికి కారణమయ్యాయి.