పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం దేశవ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతుంటే మరోపక్క సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ( టీఎంసీ) ప్రభుత్వం భారీ స్థాయిలో డాక్టర్లను బదిలీ చేసింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో పనిచేస్తున్న 42 మంది ప్రొఫెసర్లు, వైద్యులను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్ సంగీతా పాల్, డాక్టర్ సుప్రియా దాస్ కూడా బదిలీ అయిన వారిలో ఉన్నారు. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఒకవైపు నిరసనలు జరుగుతున్న తరుణంలో మమతా బెనర్జీ ప్రభుత్వం వైద్యులను బదిలీ చేయడంపై డాక్టర్ల సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. నిరసనకు మద్దతు ఇచ్చిన ఫ్యాకల్టీ సభ్యులను అన్యాయంగా బదిలీ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్ పేర్కొంది.
తమ పోరాటంలో ఐక్యంగా, దృఢంగా నిలుస్తామని ట్వీట్ చేసింది. డాక్టర్ల బదిలీలు ఒక కుట్ర అని, సీనియర్ వైద్య నిపుణులను ‘భయపెట్టే’ ప్రయత్నమని బీజేపీ విమర్శించింది.