ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి.. అలాంటిది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన సిబ్బంది లేదా అధికారులు లంచం అడిగితే తమకు తెలియజేయాలని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. ఈ మేరకు సీఎండీ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. లంచం అడిగితే 040 – 2345 4884 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని ఓ ప్రకటనలో తెలిపారు.
”మా సంస్థ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తోంది. కొంతమంది సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల సమస్యలు/ఫిర్యాదులు నేరుగా తీసుకొని వాటికి పరిష్కరించి అక్రమాలను అడ్డుకునేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఉద్యోగులు వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు”అని సీఎండీ ముషారఫ్ పేర్కొన్నారు. ఇప్పటికే నూతన సర్వీసుల మంజూరు, కేటగిరి మార్పు, టైటిల్ ట్రాన్స్‌ఫర్, బిల్లింగ్ లోపాలు ఇతర సేవలు పొందేందుకు సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో అవకాశం కల్పించినట్లు చెప్పారు.