పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడికి కఠినంగా శిక్ష పడాలంటూ వైద్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. వారం రోజుల్లో కేసును పరిష్కరించలేకపోతే సీబీఐకి అప్పగిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష భాజపా నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న వేళ పోలీసులు దీదీ ఈ డెడ్‌లైన్ విధించారు.
సీఎం మమతా బెనర్జీ సోమవారం మృతురాలి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ”ఈ కేసులో మరింతమంది నిందితులు ఉన్నట్లయితే వారందరినీ ఆదివారం లోగా అరెస్టు చేస్తాం. ఒకవేళ అప్పటిలోగా రాష్ట్ర పోలీసులు కేసును పరిష్కరించలేకపోతే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తాం. ఈ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం” అని దీదీ వెల్లడించారు.
ఇదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థపై విమర్శలు గుప్పించారు. ”సీబీఐ విజయాల రేటు చాలా తక్కువగా ఉంది. చోరీకి గురైన రబీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి కేసును వాళ్లు ఇంకా పరిష్కరించలేదు” అని మమత దుయ్యబట్టారు. విద్యార్థులు కోరుకుంటే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతవారం కూడా సీఎం చెప్పిన సంగతి తెలిసిందే.
కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ దీనిపై మాట్లాడారు. ”ఒకరి కంటే ఎక్కువమంది ఈ నేరానికి పాల్పడటమో లేదా నిందితుడికి సహకరించి ఉంటారని మేం అనుమానిస్తున్నాం. దీనిపై దర్యాప్తు చేపట్టాం. హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ప్రారంభించా. అనుమానితుల గురించి తెలిసిన వైద్య విద్యార్థులు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చు” అని తెలిపారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్ వైద్యురాలు ఆర్‌జీ కార్ ప్రభుత్వాస్పత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఆమె మర్మాంగాలు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం జరిగినట్లు శవపరీక్షలో తేలింది. శరీరంపై వివిధచోట్ల గాయాలు కనిపించాయి. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. నిందితుడిని అరెస్టు చేశారు.