కేరళలోని వయనాడ్ జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేతలు వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా రాహుల్ ఒక హమీ ఇచ్చారు. తమ పార్టీ తరఫున బాధితులకు 100కు పైగా ఇళ్లను కట్టి ఇస్తామని తెలిపారు. స్థానిక అధికారులతో సమావేశం అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో ఇంతటి భయానక విషాదాన్ని మునుపెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మిగతా వాటి మాదిరిగా కాకుండా దీనిని భిన్నంగా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని అన్నారు. అలాగే ఈ ఘటనను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని చెప్పారు. ఈసందర్భంగా 100 ఇళ్ల హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో జరిగిన ప్రాణ, ఆర్థిక నష్టం గురించి అధికారులు ఆయనకు వెల్లడించారు.
ఈ విషాదం జాతీయ విపత్తని రాహుల్ అభివర్ణించిన సంగతి తెలిసిందే. వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పునర్నిర్మాణం చేపట్టాలని కేంద్రాన్ని డిమాండు చేశారు. ఆయన తన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీతో కలిసి గురువారం కొండ చరియలు విరిగిపడిన చురాల్‌మలలో పర్యటించారు. వీరిద్దరూ తాత్కాలికంగా చెక్కతో ఏర్పాటుచేసిన వంతెనను దాటి బురద పేరుకుపోయిన ప్రాంతాల్లో వర్షంలోనే తిరిగారు. ఈ రోజు కూడా వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ విలయంలో సర్వం కోల్పోయిన వారికి మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 121 మంది మానసిక నిపుణుల బృందాన్ని వయనాడ్ పంపినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.