Tuesday, October 15, 2024
HomeUncategorizedరెండో విడ‌త నామినేటెడ్ ప‌ద‌వుల జాబితా ఖ‌రారు..

రెండో విడ‌త నామినేటెడ్ ప‌ద‌వుల జాబితా ఖ‌రారు..

Date:

తెలంగాణ ప్ర‌భుత్వంలో రెండో విడ‌త నామినేటెడ్ ప‌ద‌వుల జాబితా ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తరువాత ఈ జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో టీపీసీసీకి కొత్త సారధితో పాటుగా మంత్రివర్గ విస్తరణ పైన పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

సీనియర్లకు ప్రాధాన్యత

రెండో విడత నామినేటెడ్ పదవుల్లో భాగంగా మొదటి విడతలో చోటు దక్కని సామాజిక వర్గాలకు, నేతలకు ఈసారి బెర్త్ పక్కా అనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. ఈసారి చాలా కీలకమైన కార్పొరేషన్ పదవులు భర్తీ కానున్నాయి. ఆర్టీసీ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్, మూసీ కార్పొరేషన్, హెచ్ఎండిఏ, రెడ్కో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాకా, రైతు కమిషన్, విద్యా కమిషన్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్, యాదవ, కూర్మ కార్పొరేషన్, చేనేత కార్పొరేషన్ పదవులు భర్తీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరి పేర్లు ఫైనల్ అయినట్లు సమాచారం.

జాబితా సిద్దం

రైతు కమిషన్ చైర్మన్ గా సీనియర్ నేత కోదండరెడ్డి, విద్య కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు ఆమోదించినట్లు పార్టీ నేతల సమాచారం. ఈ రెండు కమిషన్‌లలో చెరో నలుగురు చొప్పున 8 మందిని మెంబర్లుగా నియమించనున్నారు. ప్రస్తుత బీసీ కమిషన్ కాల పరిమితి ముగియనుంది. కొత్త కమిషన్ ఛైర్మన్ గా నిరంజన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్ర హెచ్ఆర్సీ, సమాచార హక్కు చట్టం సభ్యులను నియమించాల్సి ఉంది. దీంతో, వచ్చే వారం రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.