Tuesday, October 15, 2024
HomeUncategorizedయుద్ధాల కంటే రోడ్డు ప్ర‌మాదాల్లోనే ఎక్కువ మ‌ర‌ణాలు

యుద్ధాల కంటే రోడ్డు ప్ర‌మాదాల్లోనే ఎక్కువ మ‌ర‌ణాలు

Date:

మ‌న‌దేశంలో రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. యుద్ధాలు, ఉగ్రవాదం, నక్సలిజం ఘటనల్లో మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో ఏటా లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆయన.. రోడ్డు ఇంజినీరింగ్‌లో లోపాల కారణంగానూ అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నారు. ఫిక్కీ రోడ్‌ సేఫ్టీ అవార్డ్స్‌, కాంక్లేవ్‌ 2024లో పాల్గొన్న గడ్కరీ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

”యుద్ధాలు, ఉగ్రవాదం, నక్సలిజం ఘటనల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మూడు లక్షల మంది గాయపడుతున్నారు. తద్వారా దేశ జీడీపీకి 3శాతం నష్టం వాటిల్లుతోంది. రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లను బలిపశువులను చేస్తారు.. కానీ, రోడ్డు ఇంజినీరింగ్‌లోనూ (డీపీఆర్‌) లోపాలున్నాయి” అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. దేశంలోని అన్ని హైవేలకు సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే.. లైనులో వెళ్లే క్రమశిక్షణ పాటించాలన్నారు. అంబులెన్సులు, వాటి డ్రైవర్లకు ప్రత్యేక కోడ్‌లను ఇచ్చేందుకు తమ మంత్రిత్వశాఖ సిద్ధమవుతోందని అన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో బాధితులను రక్షించేందుకు వేగంగా స్పందించడంతోపాటు.. కట్టర్ల వంటి అధునాతన పనిముట్లను వాడకంలో వారికి శిక్షణ ఇస్తామన్నారు.