Tuesday, October 15, 2024
HomeUncategorizedయజమానితో తీర్థయాత్రలకు వెళ్లి తప్పిపోయిన కుక్క

యజమానితో తీర్థయాత్రలకు వెళ్లి తప్పిపోయిన కుక్క

Date:

ఒక వ్యక్తి తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు తనతో వచ్చిన పెంపుడు కుక్క అక్కడ తప్పిపోయింది. అయితే 250 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి యజమాని ఇంటికి చేరింది. దీంతో సంతోషం పట్టలేని ఆ కుక్క యాజమాని దాని రాకను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు. ఆ కుక్క మెడలో దండ వేసి స్వాగతం పలకడంతోపాటు గ్రామస్తులకు విందు ఇచ్చాడు. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. యమగర్ని గ్రామానికి చెందిన కమలేష్ కుంభార్‌ ఇంట్లో ‘మహారాజ్’ అనే పెంపుడు కుక్క ఉంది. ప్రతి ఏటా ఆయన భక్తులతో కలిసి దక్షిణ మహారాష్ట్రలోని పంఢర్‌పూర్‌కు కాలినడకన తీర్థయాత్రగా వెళ్తుంటాడు. ఈసారి పెంపుడు కుక్క కూడా అతడిని అనుసరించింది.

జూన్‌లో సుమారు 250 కిలోమీటర్లు నడిచిన కుమలేష్‌ బృందం మహారాష్ట్రలోని విఠోబా ఆలయానికి చేరుకుంది. అయితే పాండురంగ స్వామి దర్శనం తర్వాత పెంపుడు కుక్క ‘మహారాజ్’ తప్పిపోయింది. దీంతో కమలేష్ ఆందోళన చెందాడు. తన కుక్క కోసం అక్కడంతా వెతికాడు. మరో గుంపుతో కలిసి అది వెళ్లినట్లు కొందరు వ్యక్తులు చెప్పారు. దీంతో జూన్‌ 14న కమలేష్‌ తన ఇంటికి చేరుకున్నాడు.

మరోవైపు ఆ మరునాడు పెంపుడు కుక్క తన యజమాని ఇంటికి చేరుకుంది. తోక ఊపుతూ ఇంటి ముందున్న ‘మహారాజ్’ను చూసి కమలేష్ కుంభార్‌ ఆనందం పట్టలేకపోయాడు. ఒంటరిగా 250 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోని తన గ్రామానికి అది చేరుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. పాండురంగ నాథుడే ఆ కుక్కకు దారి చూపి తన ఇంటికి చేర్చినట్లు భావించాడు. ‘మహారాజ్’ మెడలో పూల దండ వేసి హారతి ఇచ్చి తన ఇంట్లోకి స్వాగతం పలికాడు. అంతేగాక గ్రామస్తులకు విందు కూడా ఇచ్చాడు.