Tuesday, October 15, 2024
HomeUncategorizedమోడీని పెద్ద‌న్న అని పిలుస్తే త‌ప్పేముంది

మోడీని పెద్ద‌న్న అని పిలుస్తే త‌ప్పేముంది

Date:

దేశ ప్రధాని మోడీని పెద్దన్న అని సంభోదించటంలో తప్పేముంది. రాష్ట్రానికి నిధులు సాధించటం కోసమే పెద్దన్న అని సంబోధించానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి నిధులు కోరితే కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ పాతబస్తీకి మెట్రో రైలు అంశాన్ని లేవనెత్తారు. ఎప్పటిలోగా మెట్రో రైలు నిర్మాణం చేపడతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ”ఈ ప్రభుత్వం ఎల్బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మించనుంది. పాతబస్తీ ప్రజలకు మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట మీదుగా మెట్రో రైలు నిర్మాణం చేపడతాం. 78 కి.మీ మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక ఇచ్చాం. పాతబస్తీ, ఎయిర్‌పోర్టుకు మెట్రోను కచ్చితంగా నిర్మించి తీరుతాం. రెండో దశకు ఇప్పటికే భూ సేకరణ మొదలుపెట్టాం.

తెలంగాణకు నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోంది. నిధులన్నీ యూపీ, బిహార్‌, గుజరాత్‌కే కేటాయిస్తున్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని బహిరంగసభ వేదికగా మోదీకి చెప్పాను. రాష్ట్రాల పట్ల పెద్దన్నలాగా వ్యవహరించాలని కోరా. ఫెడరల్‌ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవాల్సిందే. చేయాల్సిన ప్రయత్నాలు పూర్తిగా చేయాల్సిందే. వాళ్లు ఇవ్వనంత మాత్రాన రాష్ట్రాభివృద్ధి ఆగదు. చాలా ఫైనాన్షియల్‌ సంస్థలు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2029 ఎన్నికల నాటికి పాతబస్తీకి మెట్రోరైలు నిర్మించి అదే మెట్రో రైల్‌లో అక్బరుద్దీన్‌ ఒవైసీతో కలిసి ఓల్డ్‌ సిటీకి వెళ్తా” అని సీఎం అన్నారు. పాతబస్తీని ఇస్తాంబుల్‌ చేస్తామని, వరంగల్‌ను లండన్‌గా మారుస్తామని, కరీంనగర్‌ను న్యూయార్క్‌ చేస్తామని అబద్ధాలు చెప్పి మోసం చేయబోమని వ్యాఖ్యానించారు.