భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో దేశ స్వాతంత్య్ర దినోత్సవం సంధర్బంగా అరుదైన సంఘటన జరిగింది. ఇరు దేశాలకు చెందిన మహిళా జవాన్లు తొలిసారి సాంప్రదాయ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతోపాటు స్వీట్లు పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం గెడే సరిహద్దులోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) పోస్ట్ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. 32వ బెటాలియన్‌కు చెందిన ఆరుగురు బీఎస్‌ఎఫ్ మహిళా జవాన్లు, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కు చెందిన మహిళా సైనికులు కలుసుకున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతోపాటు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య పరస్పర గౌరవం, స్నేహభావానికి ఈ సాంప్రదాయం ప్రతీక అని 32వ బెటాలియన్ బీఎస్‌ఎఫ్ కమాండెంట్ సుజీత్ కుమార్ తెలిపారు. అయితే ఇరు దేశాల సరిహద్దు దళాలకు చెందిన మహిళా సైనికులు ఈ వేడుకలో పాల్గొనడం తొలిసారి అని వెల్లడించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఆ దేశంలో ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో 4,000 కిలోమీటర్ల సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతున్నది.