పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో జరిగిన జూనియర్ వైద్యురాలి అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్త నిరసన చేపడుతున్న వైద్యులు తక్షణమే సమ్మె నిలిపివేయాలని కేంద్రం సూచించింది. వారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. దేశంలో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది.
జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా భారత వైద్య సంఘం (ఐఎంఏ) సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసరం కాని వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ఆస్పత్రులలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కమిటీ ఏర్పాటు చేస్తామని వైద్యులకు కేంద్రం హామీ ఇచ్చింది. వైద్యవృత్తిలో ఉన్నవారి భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరింది.