Tuesday, October 15, 2024
HomeUncategorizedపొర‌పాటున డిప్యూటీ క‌లెక్ట‌ర్‌పై లాఠీచార్జ్‌

పొర‌పాటున డిప్యూటీ క‌లెక్ట‌ర్‌పై లాఠీచార్జ్‌

Date:

దేశ‌వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం భారత్‌ బంద్‌కు రిజర్వేషన్‌ బచావో సంఘర్ష్‌ సమితి పిలుపునిచ్చింది. అయితే ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఒక పోలీస్ పొరపాటున జిల్లా డిప్యూటీ కలెక్టర్‌పై లాఠీచార్జ్‌ చేశాడు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఆందోళనకారులు భారత్ బంద్‌ పాటించేందుకు ప్రయత్నించారు. పోలీస్‌ బారికేడ్లను దాటుకుని పాట్నాలోని డాక్ బంగ్లా వద్దకు చేరుకున్నారు.

పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు, భద్రతా దళాలు ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్ ప్రయోగించడంతోపాటు లాఠీ చార్జ్‌ చేశారు. అయితే సివిల్‌ డ్రెస్‌లో ఉన్న పాట్నా జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ (ఎస్‌డీఎం) శ్రీకాంత్ కుండ్లిక్ ఖండేకర్‌ను కూడా ఆందోళనకారుడిగా ఒక పోలీస్‌ పొరపాటుపడ్డాడు. ఆయనను కూడా లాఠీతో కొట్టాడు. మరోవైపు పక్కనే ఉన్న పోలీస్‌ అధికారులు, ఇతర పోలీస్‌ సిబ్బంది వెంటనే స్పందించారు. ఎస్‌డీఎంపై లాఠీ చార్జ్‌ చేసిన పోలీస్‌ను పక్కకు తీసుకెళ్లారు. ఆయన ఎస్‌డీఎంగా చెప్పగా ఆ పోలీస్‌ క్షమాపణలు చెప్పాడు.