పాము కారణంగా ఒక్క భారతదేశంలోనే ప్రతి ఏటా 58000 మరణాలు సంభవిస్తున్నయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. భారతదేశంలో 2000- 2019 మధ్యకాలంలో దాదాపు 12 లక్షల మంది పాము కాటు కారణంగా మరణించినట్లు ఒక రిపోర్ట్ తెలిపింది. ఈ మరణాల్లో 97 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే సంభవించాయంట. పాముకాటు కారణంగా మరణించేవాళ్లే పురుషులే ఎక్కువగా ఉన్నారని.. పురుషులు పొలాల్లో పనిచేయడం దీనికి ఒక కారణం అని ఆ రిపోర్ట్ చెబుతోంది.
అయితే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు పాము కాటు వల్ల మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇస్తాయని చాలామందికి తెలియదు. భారతదేశం వ్యవసాయ దేశం కావడం వల్ల అత్యధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అనేక రాష్ట్రాలు.. పొలాల్లో పాము కాటు కారణంగా సంభవించే మరణాలను విపత్తుగా ప్రకటించాయి. ఈ కారణంగానే పాము కాటుకు గురై మరణిస్తే బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందజేస్తుంది.
*బీహార్*
2022లో బీహార్ ప్రభుత్వం..పాము కాటుతో ఎవరైనా మరణిస్తే మృతుల కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించింది. ఏ సీజన్‌లో మరణం సంభవించినా కూడా పరిహారం అందుతుందని బీహార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు, మరణాల సంఖ్య పెరుగుతుందని సాధారణంగా నమ్ముతారు. ఈ సీజన్‌లో పాములు పొలాలు లేదా తోటలలో మాత్రమే కాకుండా తరచుగా ఇళ్లలో కూడా కనిపిస్తాయి.
*కేరళ*
కేరళలో పాము కాటుతో మరణిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ఇస్తుంది. గతంలో కేరళ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇచ్చేది. అయితే ఈ పరిహారం చాలా తక్కువని, దానిని రూ.5 లక్షలకు పెంచాలని కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
*ఉత్తరప్రదేశ్*
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాము కాటు వల్ల మరణాన్ని ప్రమాదంగా పరిగణిస్తోంది. యూపీలో పాము కాటుతో మరణిస్తే ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం అందజేస్తుంది. మరణించిన వ్యక్తి రైతు అయితే, రైతు బీమా పథకం కింద నష్టపరిహారం సొమ్ముతో కలిపి రూ.లక్ష అదనంగా కుటుంబానికి అందజేస్తారు.
*తమిళనాడు*
2013లో పాము కాటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన నాలుగేళ్ల చిన్నారి కుటుంబానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు ప్రభుత్వం రూ.లక్ష నష్టపరిహారం ఇచ్చింది.
*ఎలా క్లెయిమ్ చేయవచ్చు?*
పాము కాటుకు గురై ఎవరైనా మరణిస్తే, నష్టపరిహారం పొందేందుకు బాధిత కుటుంబం దగ్గర పోస్టుమార్టం నివేదిక ఉండటం తప్పనిసరి. దీని ఆధారంగా కుటుంబానికి ఆర్థిక సహాయం పొందవచ్చు. అందువల్ల, సంఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టం చేయించడం చాలా ముఖ్యం. దీని తర్వాత సంబంధిత అధికారుల ద్వారా పేపర్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇది విపత్తు వల్ల సంభవించిన మరణం కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. నష్టపరిహారం మొత్తాన్ని 48 గంటల్లో బాధిత వ్యక్తి సమీప బంధువుల బ్యాంక్ అకౌంట్‌కు పంపుతుంది.