Tuesday, October 15, 2024
HomeUncategorizedప‌రిమితి మించిన‌ వేగంతో న‌డిపిన వాహానం

ప‌రిమితి మించిన‌ వేగంతో న‌డిపిన వాహానం

Date:

ప‌రిమితి మించిన వేగంతో వాహానం న‌డిపినందుకు కేంద్ర‌మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ వాహనానికి ఈ-చలానా జారీ అయ్యింది. అతివేగం కారణంగా అపరాధం విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చిరాగ్‌ పాసవాన్‌ ప్రయాణిస్తున్న వాహనం బిహార్‌లోని హాజీపుర్‌ నుంచి చంపారన్‌కు వెళుతుండగా ఈ- చలానా జారీ అయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. జాతీయ రహదారిపై పరిమితికి మించిన వేగంతో వెళుతుండగా.. దాన్ని గుర్తించిన ఈ- డిటెక్షన్‌ సిస్టమ్‌ ఆయన వాహనానికి ఆటోమేటిక్‌ చలానాను జారీ చేసినట్లు తెలుస్తోంది. అతివేగమే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆయన వాహనానికి రెండు వేల రూపాయల వరకు చలానా విధించారు. ఈ చలానాతో కేంద్రమంత్రికి సంబంధం లేదంటూ చిరాగ్‌ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఏమిటీ ఈ-డిటెక్షన్‌ సిస్టమ్‌..

అతివేగంగా వెళ్లడం, డాక్యుమెంట్‌ లోపాలను సులువుగా ఈ- డిటెక్షన్‌ గుర్తిస్తుంది. ఈ సిస్టమ్‌ బిహార్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఆటోమేటిక్‌ చలానాల జారీ కోసం అన్ని టోల్‌ ప్లాజాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించేందుకు ఈ సిస్టమ్‌ను ఆగస్టు నుంచి అమలు చేస్తోంది. వాహనాల ఫిట్‌నెస్‌, కాలుష్య, డాక్యుమెంట్‌ లోపాలు, అతివేగంగా వెళ్లినప్పుడు చలానా జారీ అవుతుంది, అది నేరుగా ఆ కారు యజమాని మొబైల్‌ ఫోన్‌కు సందేశం రూపంలో వెళుతుంది.