పశ్చిమబెంగాల్ కోల్‌కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనతో రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించేందుకు కొందరు వైద్యులు భయపడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మహిళా డాక్టర్లు ఇందుకు వెనకడుగు వేస్తున్నారని తేలింది. ఆత్మరక్షణ కోసం విధులకు వచ్చేటప్పుడు ఆయుధాలను వెంట తెచ్చుకోవాలని భావిస్తున్నారని కొందరు మహిళా డాక్టర్లు చెపుతున్నారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో వైద్యుల భద్రతకు సంబంధించిన సమస్యలను అంచనా వేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల ఓ ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో 22 రాష్ట్రాలకు చెందిన 3885 మంది ప్రభుత్వ/ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు. వీరిలో 85శాతం మంది 35ఏళ్లలోపు వారే. 61శాతం మంది ఇంటర్న్‌లు లేదా పీజీ వైద్యవిద్యార్థులే. సర్వేలో వారు వెల్లడించిన విషయాలు..
భయపడుతున్న వైద్య విద్యార్థులు
సర్వేలో పాల్లొన్న వైద్యుల్లో 24.1శాతం మంది నైట్ డ్యూటీలో సురక్షితంగా భావించడం లేదని మరో 11.4శాతం మంది అత్యంత ఆందోళన వ్యక్తంచేసినట్లు తేలింది. ఇలా భయపడుతోన్న వారిలో అత్యధికులు మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులే ఉన్నారు. నైట్ షిఫ్టుల్లో డ్యూటీ రూమ్ లేదని సర్వేలో పాల్గొన్న 45శాతం మంది పేర్కొన్నారు. డ్యూటీ రూమ్‌లు ఉన్నవారు మాత్రం అత్యంత సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. డ్యూటీ రూమ్‌లు ఉన్నచోట అవి సరిపోవడం లేదని, గోప్యత లేకపోవడం, తాళాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంచుకోవాల్సి వస్తుందని చాలామంది అభిప్రాయం. అందుబాటులో ఉన్న మూడింట ఒకవంతు డ్యూటీ రూమ్‌లలో అటాచ్‌డ్ బాత్‌రూమ్‌లు లేవని తేలింది. వాటికోసం చాలాదూరం వెళ్లాల్సి వస్తోందని తెలిసింది. సగానికిపైగా (53శాతం) డ్యూటీ రూమ్‌లు.. వార్డులు/అత్యవసర చికిత్సా విభాగాలకు చాలా దూరంలో ఉన్నాయని అధ్యయనంలో వెల్లడైంది. మొత్తంగా సర్వేలో పాల్గొన్న అనేకమంది రాత్రి షిఫ్టుల్లో సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో పలు భద్రతా చర్యలను సూచించినట్లు తెలిపింది. శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, అవసరమైన చోట విద్యుత్ దీపాలు, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్టు అమలు, రోగి బంధువుల సంఖ్యను నియంత్రించడం, సైరన్ వ్యవస్థల ఏర్పాటు, కనీస సౌకర్యాలతో డ్యూటీ రూమ్‌లు ఏర్పాటు వంటివి సూచించినట్లు తాజా అధ్యయనం పేర్కొంది.