తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. మూఢాలు పోయి వివాహ శుభ ముహూర్తాలు రావడంతో వధూవరులు వేద మంత్రాల సాక్షిగా ఒకటవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్ట్ 7న ప్రారంభమైన పెళ్లి ముహూర్తాలు ఆగస్ట్ 28వ తేదీ వరకు ఉన్నాయని వేద పండితులు చెప్తున్నారు. ఆ తర్వాత 29న తిరిగి మూఢాలు ప్రారంభమై మూడు నెలల వరకు అంటే దాదాపుగా అక్టోబర్ 13 వరకు పెళ్లి ముహూర్తాలు లేవని పురోహితులు చెబుతున్నారు.
*మళ్లీ ఫంక్షన్ల హడావుడీ..*
ఆగస్ట్ 11, 18 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెప్పడంతో వధూవరుల తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏడవ తేదీ నుండి వివాహ శుభ ముహూర్తాలు ప్రారంభం కాగా, ఆగస్ట్ 9 ,10 ,11, 15 ,17, 18 ,22 ,23, 24, 28 తేదీల్లో వివాహాలు జరగనున్నాయి. మూడు నెలల క్రితం వివాహ శుభాకాంక్షలు ముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు ఆగిపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఫంక్షన్ హాల్ లు, గోల్డ్ షాప్, బట్టల షాప్, ఈవెంట్ మెనీజింగ్ సంస్థలకు వ్యాపారాలకు పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ ముహూర్తాలు స్టార్ట్ అవ్వడంతో వీరికి డిమాండ్ పెరిగింది.
*ఒకే నెలలో భారీగా ముహుర్తాలు*
ఒకే నెలలో వరుసగా ముహూర్తాలు ఉండడంతో పురోహితులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వీరితోపాటు వంటల కోసం పేరు ఉన్న క్యాటరింగ్ సంస్థల కోసం సెట్ చేస్తున్నారు పేరెంట్స్. దీంతో వధూవరుల ఆర్థిక స్థితిని బట్టి పురోహితులు వివాహం జరిపించడానికి రూ. 10,000 నుండి రూ. 25వేల రూపాయల వరకు అడుగుతున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితం నిశ్చితార్థం చేసుకున్న వధూవరుల తల్లితండ్రులు అప్పటి పురోహితులకు పెళ్లి కి ఫిక్స్ చేసుకుంటున్నారు. మొత్తానికి దాదాపు మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి భాజాలు, బంధుమిత్రుల హడావిడి మొదలైంది.