తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పాక్షికంగా చేశామని చెబితే ఒప్పుకొంటాం కానీ.. మొత్తం చేశామంటే అంగీకరించేది లేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ మొత్తం రూ.31 వేల కోట్లని కేబినెట్‌లో చెప్పారని తెలిపారు. కానీ రూ.14 వేల కోట్లు కోత పెట్టి మొత్తం చేశామంటున్నారని విమర్శించారు. పాక్షిక రుణమాఫీ చేసినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 46 శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు.
”రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రుణమాఫీ సంపూర్ణంగా అయిందో లేదో రైతన్నలనే నేరుగా అడుగుదాం. రేవంత్‌రెడ్డి చరిత్ర, నా చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మాట తప్పింది ఎవరు? ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది. రుణమాఫీ, 6 గ్యారంటీలు సంపూర్ణంగా చేస్తేనే రాజీనామా చేస్తానన్నాను. ఆరు గ్యారంటీల సంగతి ఏమో కానీ, రుణమాఫీ కూడా మొత్తం చేయలేదు. రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య ఎలా తగ్గింది. రైతులకు ఎగ్గొడితేనే లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. సంపూర్ణంగా అమలు చేశామని రేవంత్‌రెడ్డి చెప్పగలరా? కాంగ్రెస్ రుణమాఫీ చేసింది 22 లక్షల మంది రైతులకే. 26 లక్షల మందికి అమలు కాలేదు. రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని అడిగితే నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. కేసీఆర్ హయాంలో జూన్, జులైలోనే రైతుబంధు డబ్బులు అందించాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇప్పటికీ ఇవ్వలేదు. రేవంత్‌రెడ్డి రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రుణమాఫీకి అర్హులైన రైతులు ఎందరు? ఎంతమంది రైతులకు అందించారో చెప్పాలి. రైతుల ఖాతాల్లో ఎంత డబ్బు జమ చేశారు? ఇంకా ఎంత మంది ఖాతాల్లో డబ్బులు వేయాలో చెప్పాలి” అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.