Tuesday, October 15, 2024
HomeUncategorizedతెలంగాణ‌లో ప‌లు జిల్లాల‌కు ఎల్లో హెచ్చ‌రిక‌లు

తెలంగాణ‌లో ప‌లు జిల్లాల‌కు ఎల్లో హెచ్చ‌రిక‌లు

Date:

తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ సంచాలకులు ప్రకటించారు. బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.

మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1కి.మీ ఎత్తు వరకు ఆవరించిన ఉందని వివరించారు. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు.