Tuesday, October 15, 2024
HomeUncategorizedతెలంగాణకు, రాజీవ్‌ గాంధీకి ఏం సంబంధం..?

తెలంగాణకు, రాజీవ్‌ గాంధీకి ఏం సంబంధం..?

Date:

తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్‌ గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసినట్లేనని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాఖీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో అధికారం, పదవులు శాశ్వతం కాదన్నారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్నిచాటేలా కేసీఆర్ సచివాలయాన్ని కడితే.. కాంగ్రెస్‌ సర్కారు రాజీవ్‌ విగ్రహం చేయడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు, రాజీవ్‌కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. వందలమంది ప్రాణాలు తీసిన నాయకుడి విగ్రహం పెడతారా ? నిలదీశారు.

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ప్రస్తుతం విగ్రహాన్ని పెట్టినా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పారు. రేవంత్‌రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌లో పెట్టుకో లేకపోతే జూబ్లీహిల్స్‌లో లేదంటే.. ఇంట్లో పెట్టుకోవాలన్నారు. అంతేగానీ తెలంగాణ తల్లిని అవమానిస్తే ఊరుకోమన్నారు.