ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ కోర్టుకు కొన్ని అంశాలను వెల్లడించింది. తాను 12 సార్లు సివిల్స్ పరీక్ష రాసినట్లు ఆమె చెప్పారు. కానీ దాంట్లో ఏడు ప్రయత్నాలను పరిగణలోకి తీసుకోరాదు అని ఆమె కోర్టుకు విన్నవించారు. ఏసీఎల్(యాంటీరియర్ క్రూసియేట్ లిగామెంట్)తో బాధపడుతున్నట్లు మహారాష్ట్ర ఆస్పత్రి తనకు సర్టిఫికేట్ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఎడమ మోకాలికి ఆ గాయమైంది. అందుకే దివ్యాంగ కేటగిరీలో తాను చేసిన అటెంప్ట్స్ గురించి మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోర్టుకు తెలిపారు. తనకు 47 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికేట్‌లో పూజా తెలిపారు. నిజానికి ఆ కేటగిరీలో 40 శాతం వైకల్యం ఉన్నా.. పరీక్షకు అర్హురాలే.
జనరల్ కేటగిరీ విద్యార్థిగా తాను ఏడు సార్లు సివిల్స్ పరీక్ష రాశానని, అయితే ఆ అటెంప్ట్స్‌ను పరిగణలోకి తీసుకోరాదు అని ఆమె తన అఫిడవిట్‌లో తెలిపారు. ఒకవేళ తన రిక్వెస్ట్‌ను ఆమోదిస్తే, తాను చేసిన ప్రయత్నాల సంఖ్య అయిదుకు తగ్గుతుందని ఆమె చెప్పారు. అలా చేస్తే అప్పుడు మరో నాలుగు ప్రయత్నాలు చేసే అవకాశం తనకు ఉంటుందని పూజా ఖేద్కర్ తెలిపారు. యూపీఎస్సీ విధించిన అనర్హత వేటును ప్రశ్నిస్తూ.. తనపై చర్యలు తీసుకునే అధికారం యూపీఎస్సీకి లేదన్నారు. సివిల్స్ పరీక్షను విజయవంతంగా క్లియర్ చేసేందుకు తాను ఎటువంటి చీటింగ్‌కు పాల్పడలేదని ఆమె మరో అఫిడవిట్‌లో కోర్టుకు తెలిపారు. దివ్యాంగ(పీడబ్ల్యూబీడీ) కేటగిరీలో మెరిట్ ద్వారా పూజా ఖేద్కర్ సివిల్స్‌కు ఎంపికయ్యారు. ఆమె ఆ కేటగిరీలో అయిదో ప్రయత్నంలో క్లియర్ అయ్యింది. అయితే ఈ కేటగిరీలో దివ్యాంగులు 9 సార్లు అటెంప్ట్ చేయవచ్చు. 2012 నుంచి 2017 వరకు పూజా ఖేద్కర్ దివ్యాంగ కేటగిరీలో పరీక్ష రాయలేదు. పర్సనాల్టీ పరీక్ష సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు యూపీఎస్సీ చేసిన ఆరోపణలను పూజా ఖండించారు.